Monday, 7 October 2013

అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహాలయం శిలాశాసనం

"శ్రీయుతు డంతర్వేది నరసింహులకున్ కొపనాతి యాదినా
రాయణుడాఢ్యుడై భగవదర్పిత బెద్ధిని వప్రసద్విమా
నాయత మంటపాదులు ప్రియంబున కొన్ని ఘటించి సాంగమున్
జేయగ నాత్మజాళికిని జెప్పినతోడగు రంగనాథుతో
ధీయుతుడైన కృష్ణుడది దివ్య మహామహిమన్ జలంగగా
హాయిగ శాలివాహన శకాబ్దము లింద్రియ వేదభూధరేం
ద్రాయత వద్ద నిల్పనగు 1745 తోరపు వత్సర మా స్వభానువం
దాయధి చైత్ర కృష్ణ దశమార్యమ వాసర వేళ భూరిజ
ల్వౌయకలంక భక్తి ఘనులౌనన నిచ్చె కృతార్థచిత్తుడై."

ఇది అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహాలయం దక్షిణగోడలో నైరుతిదిశగా ఉన్న శిలాశాసనం.
ఈ శాసనాన్నిబట్టి ఈ ఆలయ నిర్మాణం శాలివాహన శకం 1745 అనగా క్రీ.శ.1823నాటికి పూర్తయినట్లుగా తెలుస్తుంది. దేవాదాయ శాఖ వెబ్ సైట్ లో 1923 అని పేర్కొన్నారు.
అది ఇక్కడ http://www.antarvedisrilakshminarasimhaswamy.com/temple_history.php?task=next5 చూడవచ్చు.
మెడకాయమీద తలకాయ ఉన్నవాడెవడికైనా ఈ తెలుగు 1920 ప్రాంతాల్లో ఉన్న తెలుగు కాదన్నది అర్థమైపోతుంది. మీరూ చూడండి...

శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారు - పూర్వీకులు


శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారు

"అంతర్వేది" శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము నిర్మింపజేసినది, గొప్ప భగవద్భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి "శ్రీ కొపనాతి కృష్ణమ్మ"గారు. కృష్ణమ్మగారి జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం మండలం బెండమూర్లంక శివారు "ఓడలరేవు" గ్రామము. ఇది వైనతేయ గోదావరి సాగరసంగమ పుణ్య స్థలము. వీరు రఘుకులగోత్రజులును, అగ్నికులక్షత్రియులు ను అయి ఉండిరి.

పూర్వీకులు

ఓడల నిర్మాణములో, ఓడల వ్యాపారములో పేరుపొంది సార్థకనామము పొందినది ఓడలరేవు గ్రామము. అగ్నికులక్షత్రియులు సాహసముతో తెరచాప ఓడలను సముద్రములో నడుపుచూ విదేశములతో వ్యాపారము సాగించుచున్న రోజులవి. అట్టి వంశీయులలో అగ్రగణ్యులు కొపనాతివారు. వారియందు సత్యరాజు, మంగమాంబ దంపతులు సత్యవాక్య పరిపాలకులై కీర్తివహించిరి. ఆ పుణ్యదంపతులకు రామనాఖ్యుడు సుపుత్రుడై జన్మించి భక్తవర్యుడని పెంపువహించెను. ఆయనకు అలివేలుమంగమ్మ అర్థాంగియై అమరినది. వీరికి సత్యరాజు, ఆదినారాయణ, శేషయ్య అను పుత్రత్రయము కలిగి పూజ్యులై కీర్తి వహించిరి. ఇందు మధ్యముడైన ఆదినారాయణగారు యుక్తవయస్కులు కాగానే పొన్నమండ నరసింహస్వామి వారి పుత్రికయైన మహాలక్ష్మిని పెండ్లియాడిరి.
ఆదినారాయణగారు అనేక ధర్మకార్యములు ఆచరించిన మహామహులు. వీరికి ఏడుగురు కుమారులు కలిగిరి. వారు వరుసగా సుబ్బారాయుడు, చినసుబ్బారాయుడు, రామస్వామి, నారాయణస్వామి, కృష్ణమ్మ, వేంకటరెడ్డి, రంగనాయకులు.

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణము

అంతర్వేది ఆలయ నిర్మాణం

దూరప్రదేశమునుండి అంతర్వేది క్షేత్రమును దర్శింపవచ్చిన బ్రాహ్మణోత్తముడు ఒకరు స్వామివారిని దర్శించి జీర్ణాలయమును గాంచి, అనుభవజ్ఞులద్వారా ఆ వృత్తాంతమును తెలిసికొని ఈ ప్రదేశము గొప్ప దివ్యక్షేత్రముగా వెలయగలదని భావించి స్వామివారికి ఆలయమంటపాదులు ఏర్పరచగల సమర్థుడు, భక్తవర్యుడు, త్యాగపురుషుడు ఎవరాయని గ్రామగ్రామములు తిరుగుచుండెను. ఎవ్వరును బ్రాహ్మణుని మాటలు వినిపించుకొనలేదు.
వైనతేయసాగరసంగమ పుణ్యస్థలము, నౌకావ్యాపారానికి కేంద్రమై ఓడలరేవుగా సార్థకనామమునందిన గ్రామసీమ. బంగారులంక (బెండమూర్లంక) దీని సమీపగ్రామము. అగ్నికులక్షత్రియులు ఓడల వ్యాపారము చేయుచు లక్ష్మీసంపన్నులై ఉన్న రోజులవి. ఇందు కొపనాతివారు గొప్ప ఉదారులైన భక్తవర్యులని పేరుపొందిరి.
బ్రాహ్మణోత్తముడు ఓడలరేవు గ్రామము విచ్చేసి భక్తవర్యులైన కొపనాతి ఆదినారాయణగారిని దర్శించుకొనిరి. బ్రాహ్మణుని బహువిధముల సత్కరించి ఆదినారాయణగారు విషయమును తెలిసికొని నిస్పృహ చెంది అంతటి ఆలయనిర్మాణము తమవలన కాదని సమాధానము చెప్పి పంపివేసిరి.
నాటిరాత్రి ఆదినారాయణగారికి నల్లనిరూపువాడు, నామాలు ధరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కలలో కనిపించి "భక్తా! నీవు అసమర్థుడవు కావు. ఆలయనిర్మాణమునకు పూనుకొనుము. అశ్రద్ధ చూపుచున్నావేమి? లెమ్ము" అని వీపుపై చేతితో ఒక్క చరుపు చరిచి అదృశ్యులైరి. ఆదినారాయణగారు తుళ్ళిపడి లేచి చూచుకొనగా తమ వీపుపై ఐదువేళ్ళు ఆనవాళ్ళు కనిపించగా ఆశ్చర్యపడి అపచారమును మన్నించమని కోరుకొని ఆలయనిర్మాణ కార్యక్రమము చేపట్టుదునని సంకల్పించుకొనిరి.
భగవానుని ఆదేశానుసారము అంతర్వేది వెళ్ళి ఆదినారాయణగారు ఒక సుముహూర్తమున ఆలయ శంకుస్థాపన గావించిరి. “ఇసుక తప్ప ఏ రాయియు దొరకని ఈ దూరసముద్ర ప్రాంతమునకు మహా ఆలయ నిర్మాణమునకు కావలసిన శిలాస్తంభములును, రాళ్లనుగొనిరాబడుట గొప్పవి.
పరమభక్తులగు శ్రీ కొపనాతి ఆదినారాయణగారు శ్రీలక్ష్మీనృసింహ స్వామివారి ఆలయ బేడామంటపాదులను నిర్మించుట మొదలుపెట్టి నల్లరాళ్ళు తెప్పించి దేవాలయము చుట్టు, కోవెలలయొక్కయు, బేడామంటపము యొక్కయు పని ప్రారంభించి కొంత పనియైన పిమ్మట 'కాలోయందురతిక్రమః' అన్నట్లు కాలమాసన్నమైనందున తమ కుమారులకు ఆ దేవాలయ నిర్మాణమును పూర్తిచేయ నియోగించి తాము విష్ణుసాయుజ్యము పొందెను.

కొపనాతి కృష్ణమ్మ

ఆదినారాయణ, మహాలక్ష్మీ దంపతుల పుణ్యఫలంబుగా అవతరించిన కృష్ణమ్మగారు భక్తవరేణుల్యైయుండిరి. ఈయన చిన్ననాటినుండే భక్తిభావమును గ్రహించెను. అతిథి అభ్యాగతులను పూజించెడివారు. బ్రహ్మజ్ఞానుల బోధనలు విని అందలి అంతరార్థమును గ్రహించెడివారు.
చిన్నతనమున ఒకరోజు స్నేహితులతో కలిసి స్వగ్రామమగు ఓడలరేవునందలి సముద్రతీరమునకు వెడలి రేవుకు చేరుచున్న ఓడలను గమనించుచుండిరి. ఆ సమయమున ఒక క్రొత్తవ్యక్తి కృష్ణమ్మగారిని పిలువగా ఆయన ఆ వ్యక్తిని అనుసరించెను. చెట్లమధ్యకు తీసికొని వెళ్ళి ఆ వ్యక్తి జీవితలక్ష్యమును బోధించి తారకనామమును ఉపదేశించి అదృశ్యుడయ్యెను. కృష్ణమ్మగారిని వెదుకుకొనుచు వచ్చిన స్నేహితులు కృష్ణమ్మగారు ఏమైనారా అని దిగులుచెందిరి. ఉపదేశము పొందిన కృష్ణమ్మగారు కొంతసేపటికి ఇల్లు చేరుకొనిరి. మరునాటినుండి కృష్ణమ్మగారు స్నేహితులను జీవితపరమార్థములను గూర్చి బోధించుచుండిరి. కృష్ణమ్మగారి కుటుంబసభ్యులు ఐకమత్యముతో అలరారుచుండిరి. వీరి అగ్రజులు ఓడలపై సబురు చేయుచుండిరి. గొప్ప సిరిసంపదలతో తులతూగుచుండిరి. అవసానకాలమున ఆదినారాయణగారు ఆదేశించిన ప్రకారము అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయ నిర్మాణము కొనసాగించుటకు పూనుకొంటిరి. వీరి సోదరులైన రంగనాయకులు గారు వీరికి చేదోడువాదోడుగా ఉండి ఆలయనిర్మాణమునకు అధిక ప్రోత్సాహమొసంగిరి.
ఒకప్పుడు కోస్తారేవులకు సబురులు వెళ్ళిన ఓడలు ఎంతకాలమునకు తిరిగిరావయ్యె. వాటి వర్తమానము ఏమి తెలియదయ్యెను. ఓడలు రేవుకు చేరగలను ఆశ సన్నగిల్లెను. ఈ సమయంలో కృష్ణమ్మగారు ఒకనాటి రాత్రి ఇట్లు ధ్యానింపజొచ్చిరి. “తండ్రీ! పరాత్పరా! నీ దేవళము తలపెట్టి యింతకాలమైనది. ఇంకను పూర్తిచేయలేకుంటిని. ఈయెడ ఇల్లు జేరిన వెంటనే ఎటులనో నీ కార్యము కొనసాగింప నిశ్చయించుకొంటినే. నా మనసు నిరాశనొందుచున్నది. ఏమి చేయుదును? ఇంతవరకు ఓడ దరిచేరలేదు. మరియొక చోట ఉన్నట్లు వార్తయైనను లేదు. ఇంకేమియాశ, దానికిని కాలమాసన్నమైనట్లున్నది. ఏమి చేయుదును? నా ప్రాణతుల్యమగు ఈ మహత్కార్యము కొనసాగించుట ఎటుల? నీవే నీ కార్యమును కొనసాగింపనిది నీ పాదరజముకైన సాటిరాని ఈ దీనుడేమి చేయగలడు? ఇంకను జూచెదగాక!” యని ధ్యానించి ధ్యానించి బడలికచెంది నిదురించెను.

ఆరాత్రి ఓడలు రేవుకు చేరినట్లును కప్తాను ధనపుసంచులతోవచ్చి తనను లేపినట్లును అనుభవమయ్యెను. కృష్ణమ్మగారు లేచి బైటకు వచ్చి నిలబడియుండిరి. నిజముగా కప్తాను ఓడలు రేవుకు చేరిన సమాచారము అందజేసి, ఆనందసాగరమున నోలలాడించెను. “నాయనా! మీ రాకను భగవానుడు ముందుగానే నా కెరింగించెను. తెచ్చిన ధనము నెల్ల గదిలో వేసి తాళము వేయుము. ఆ ధనమంతా స్వామివారికి ధారపోసితిని. అందు కాసైనను ముట్టవీలులేదు" అని కప్తానును ఆదేశించి కృష్ణమ్మగారు ఆ విధముగనే ధనమును వినియోగించిరి. ఆగిపోయిన ఆలయనిర్మాణమును పునఃప్రారంభించి ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును రప్పించి కార్యక్రమములను కొనసాగించిరి.

ఆలయ నిర్మాణము

శ్రీ కొపనాతి కృష్ణమ్మగారు కొంత ద్రవ్యము చేబూని కొన్ని వందల పడవలను తీసికొని రాజమండ్రి చేరి అందున్న రాళ్ళన్నియు పడవలపై ఎగుమతి చేయించి అంతర్వేది రేవునకు చేర్చమని చెప్పి ఇంటికి మరలివచ్చెను. ఎగుమతి పూర్తయిన తరువాత ధవళేశ్వరముననొక దొరవారు ఆ పడవలను ఆపుచేయించి పడవ నడుపు పనివారను చెల్లాచెదురుగా పారద్రోలించెను. అంతనారాత్రి నరసింహదేవుడు పట్టివర్థనములు దరించి వెండిబెత్తము చేబూని దొరవారి స్వప్నమునగాన్పించి బెత్తముచే వీపుపై తట్టి లేపి నా పడవలను ఏల ఆపుజేసియుంటివి? నేనెవ్వరననుకొంటివి? అని తన వృత్తాంతమునంతయు అతనికి చెప్పి అదృశ్యుడయ్యెను. తక్షణమే పడవలన్నియు నరసింహదేవుని మహత్తుచే తెల్లవారు సరికి అంతర్వేది రేవునకు జేరియుండెను. ఈ విషయము దొరవారు తెలిసికొని నరసింహదేవునకు నమస్కరించి అపరాధమును క్షమింపుమని ప్రార్థించి ఆ దేవదేవుని మహత్తునంతయు సర్వజనులకు విశదమొనర్చెను.ఆలయనిర్మాణము నిమిత్తము రంగనాయకులుగారు అంతర్వేదిలో ఉండి పనులను చక్కబెట్టుచుండిరి. కృష్ణమ్మగారు ఎప్పటికప్పుడు ఓడలరేవునుండి పల్లకీపై అంతర్వేది వచ్చి పనులను పురమాయించి తిరిగి స్వగ్రామమునకు చేరుచుండిరి. అప్పటి దినభత్యము కూలీలకు రెండణాలు (12పైసలు) ఇచ్చుచుండిరి. దేవాలయ జమాఖర్చులను వ్రాయుచున్న కరణమును కనుగొని కృష్ణమ్మగారిట్లు మందలించిరి. “నీవు లెక్కలుకట్టిన మనము పనులు చేయజాలము. ఈ సంపాదన నాదని నీవు భావించుచుంటివా! ఇదియంతయు దేవుడే సంపాదించుకొనినాడు. దేవునిసొమ్ముతో చేయు దేవకార్యమునకు జమాఖర్చులా? ఇప్పటినుండి ఆపుచేయుము” అని ఆదేశించిరి.పేరుపొందిన శిల్పులను దూరప్రదేశములనుండి రప్పించి ఓడలపై శిలలను తెప్పించి ఉత్సాహముతో పనులను సాగించుచుండెను. ఓడలరేవునుండి కావుళ్ళతో ధనమును మోయించుకొని వచ్చి లెక్కలేకుండా వెచ్చించుచుండెను.పని ముమ్మరముగా సాగుచున్న సమయమున ఒక పనివానిపై రాయి పడి మరణించెను. ఈ సంగతి కృష్ణమ్మగారికి చెప్పగా ఆయన ఆ ప్రదేశమునకు వచ్చి పడియున్న పనివానిని పరిశీలించి పనిచేయుచున్న వారితో ఇట్లనిరి, “మీరందరు పనిని కట్టిబెట్టుడు స్వామి కార్యము చేయుచున్న ఈ భక్తుడు బ్రతికినగాని నిర్మాణము చేయవలదు” అని పనిఆపుజేయించి స్థిరసంకల్పముతో అచ్చటనే కూర్చొని ఉపవాసముతో దైవధ్యానపరాయణులై ప్రాయోపవేశమునకు గడింగిరి. భగవానుని లీలలు అత్యద్భుతముకదా! నిద్రనుండి మేల్కొంచినవానివలె ఆ పనివాడు లేచికూర్చుండెను. అచ్చటివారు ఈ అద్భుతమునకు మిక్కిలి సంతసించిరి. కాని కృష్ణమ్మగారు ఇది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి మాహాత్మ్యమేకాని తమ ప్రభావము కాదని ప్రేక్షకులను హెచ్చరించిరి.గర్భాలయము దానిజేరి బలమైన మంటపములు కుడిప్రకక్కను రామాలయము, ఎడమవైపున కల్యాణమండపము, దీనికి చుట్టును నాల్గువైపుల మంటపములు, గోపురములు, చుట్టును రాజలక్ష్మీ తాయారు, వేంకటేశ్వరస్వామి, భూదేవితాయారు, శ్రీరంగనాయక స్వామి, సంతానగోపాలస్వామి, కేశవస్వామి, పన్నిద్దరాళ్యావరులు, ఆంజనేయస్వామి, శ్రీరాములవారు, గోపాలస్వామి వార్ల పది ఆలయములును (వీరిని సన్నిధి దేవతలందురు). మంటపములమీద విమానములు కొన్ని గుండ్రముగాను, కొన్ని కూచిగాను చెక్కబడినవి. ఇట్టి అత్యద్భుత నిర్మాణములను కావించి యే స్థానమున ఏ నిర్మాణము కావలయునో అట్టి కట్టడములను నిర్మించి తీర్చిదిద్దిరి.దైవకార్యకలాపములు సాగించుచుండగా కృష్ణమ్మగారికి అనేక అవాంతరములు కలిగెను. అన్ని కార్యములలోను సహకారిగానున్న సోదరులు రంగనాథుడు స్వర్గస్థుడయ్యెను. గోరుచుట్టపై రోకటిపోటు అన్నట్లు కృష్ణమ్మగారి సతీమణి కూడ దివంగతురాలయ్యెను. వాటినన్నిటిని ఓర్పుతో భరించి, స్వామివారు తమను పరీక్షించుచున్నట్లు భావించి ఆలయ నిర్మాణమును కొనసాగించుచుండిరి.అంతర్వేది యాత్రకై వచ్చిన బ్రాహ్మణోత్తముడు ఆలయములను పరిశీలించి నిర్మాణములో ఏదో ఒక వాస్తు లోపముగలదనియు దానిని తీర్చుటకు మంగళగిరి పండితుడు తప్ప ఎవ్వరును పనిచేయరనియు కృష్ణమ్మగారితో చెప్పి వెడలిపోయెను. కృష్ణమ్మగారు వెంటనే అంతర్వేదినుండి బయలుదేరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మంగళగిరి చేరెను. కాని ఆస్థాప్రవేశము వీలుకాలేదు. ప్రహరీగోడ ప్రక్కన అంగవస్త్రముతో అహోరాత్రములు పడియుండవలసివచ్చెను. నాటిరాత్రి మంగళగిరి రాజావారి కలలో స్వామివారు కనిపించి ఒక్క దెబ్బకొట్టి తన భక్తునకు అపరాధము జరుగుచున్నదని హెచ్చరించెను. వెంటనే ఆందోళన పడి లేచి చూడగా రాజావారి వీపుపై దద్దురులు చూచుకొని ఆశ్చర్యపడి పరివారమును పిలిచి విషయమేమని యడుగగా, ద్వారపాలకులు "ఎవరో తమ దర్శనమునకు వచ్చి గోడప్రక్కనే వేచియున్నార”ని తెలియచెప్పిరి. పల్లకి పంపించి కృష్ణమ్మగారిని లోనికి రప్పించి ఉచితాసనము ఇచ్చి విషయమునడిగిరి. రాజావారు తమ ఆస్థాన పండితుని దూరప్రదేశమైన అంతర్వేది పంపుటకిష్టపడరైరి. కృష్ణమ్మగారు ఆ పండితునకు సంబంధించిన సమస్త రక్షణ పోషణాదులకు తాము స్వయముగా బాధ్యత వహింతుమని లిఖితపూర్వకముగా వ్రాసియిచ్చి ఒప్పించి పండితుని తీసికొనివచ్చిరి.మంగళగిరి పండితుడు ఆలయనిర్మాణమును పరిశీలించి స్తంభఖాతశూల వచ్చినదనియు, దానిని శాంతిజేయుటకు ధ్వజస్తంభము ప్రక్క మరియొక ద్వజస్తంభమునెత్తించి సరిజేసెను. అంతటితో ఆలయ కార్యక్రమములు పూర్తి అయ్యెను.భార్య లేనివారు ఆలయ ప్రతిష్ఠ కావించుటకు అనర్హులు కావున కృష్ణమ్మగారు వివాహము చేసికొని వైవాహిక కంకణమును, ఆలయ ప్రతిష్ఠ సంప్రోక్షణాదులు నిర్వహించుటకు సంప్రోక్షణ కంకణమును, ఉదారశీలురై దానకంకణమును వహించి- త్రికంకణధారులై ఒక సుముహూర్తమున శ్రీ లక్ష్మీనృసింహ స్వాములవారి ప్రతిష్ఠ గావించిరి.వందలకొలది యాత్రికులు, భక్తులు, యాచకులు, భూసురులు, విచ్చేసి ఈ వేడుకలు కళ్ళారచూచి తరించిరి. కృష్ణమ్మగారు దోసిళ్ళకొలది ధనమును బ్రాహ్మణులకు, పేదలకు, యాచకులకు పంచిపెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిరి. అన్నసంతర్పణలు గావించి అన్ని జీవులకు తృప్తిని కలిగించి కీర్తి వహించిరి.

Saturday, 5 October 2013

Agnikulakshatriya Community History

'అగ్నికులక్షత్రియ కులము సుమారు 2300సం||ల క్రిందట శాతవాహనులు పాలించిన ఆంధ్రమహాసామ్రాజ్యము అంతిమదశలో దేశరక్షణ కొరకు ఏర్పరచబడిన ఒక కులము` అని చరిత్ర చెబుతున్నది. అగ్నికులక్షత్రియుల అధినాయకత్వంలో దేశాన్ని సురక్షితంగా పాలించిన అనేక రాజవంశాలలో ఒకరైన పల్లవులు సుమారు 700సం||లు (క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు) దక్షిణభారతదేశంలో పాలకులుగా ఉన్నారు. క్రీ.శ.700 లలో ఆంధ్రదేశంలో వారి పాలన అంతమైన తర్వాత పరిస్థితుల ప్రభావమువల్ల వారు పల్లవవంశీయులమనే విషయము మరుగు పరుచుకొని, అప్పటికే వారిలో కొందరు అవలంబిస్తున్న వ్యవసాయము, వడ్రంగము, నౌకానిర్మాణము, విదేశీ వాణిజ్యము, దేవాలయ నిర్మాణము, నిర్వహణ (అర్చకత్వము)లో కొనసాగు చుండగా, కొందరు గత్యంతరము లేని పరిస్థితుల్లో మత్స్యకార వృత్తిని వారి బ్రతుకుతెరువుకొరకు స్వీకరించి ఉండవచ్చు. దక్షిణ భారతదేశంలో కులాల గురించి పరిశోధనలు జరిపిన ఇంగ్లీషువారు కూడా దీనిని నిర్ధారణగా చెప్పారు. కాని వారు వారి స్వప్రయోజనం దృష్టిలో పెట్టుకుని కులంపేరును అగ్నికులక్షత్రియులు బదులు 'పల్లి` అని నిర్ణయించారు. కాలక్రమేణ అగ్నికులక్షత్రియులు పై వివరించిన వ్యవసాయం, నౌకానిర్మాణం తదితర అనేక వృత్తులలో నిష్ణాతులై ఉన్నారన్న విషయం మరుగుపరచి వారి వృత్తి మత్స్యవేట అనీ, వారందరూ పల్లీలు,పల్లెకార్లేననే ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాంతో మత్స్యకారవృత్తిలోగల అగ్నికులక్షత్రియులు తమ కులం అసలుపేరు మరచిపోయి తాము పల్లెకార్లేనని చెప్పుకున్నారు. దానికితోడు పల్లీలన్నా, పల్లెకార్లన్నా పల్లవులేనని, పల్లవులే పల్లీలు, పల్లెకార్లని మన కులవృద్ధులు, మేధౄవులు విశ్లేషణ తోడయింది.
మహారాజశ్రీపొన్నమండ లక్ష్మణస్వామి వర్మగారి ఆధిపత్యంలో (కోరంగి) అగ్నికులక్షత్రియ మహాసంఘములో అగ్నికులక్షత్రియులు మత్స్యకారులు కాదని, వారిని ఎప్పుడూ, ఎక్కడా మత్స్యకారులని పిలవకూడదని రిజల్యూషన్ పాస్ చేసి, అదే ప్రకారము అప్పటి బ్రిటిషు ప్రభుత్వము ఉత్తర్వులు కోరారు. వారి కోరిక అంగీకరించిన బ్రిటిషు ప్రభుత్వంవారు జి.ఓ.నెం. 271/తే.13-6-1929 ద్వారా వీరిని తెలుగు ప్రాంతంలో అగ్నికులక్షత్రియులుగా పిలవవలసినదిగా ఉత్తర్వుల నిచ్చారు. అదే స్టేటస్ ను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. అయినా మన కులవృద్ధులు, మేధావులు కొందరు ప్రభుత్వ ఉత్తర్వులను కూడ విస్మరించి మన కులవృత్తి చేపలవేట అని, మనము పల్లీలమని, పల్లీలన్నా పల్లెకార్లన్నా పల్లవులన్నా ఒకటేనని కనుక మనము పల్లీలమని పిలిపించుకోవడం తప్పుకాదని, జోకొట్టి నిద్రపుచ్చుతూ, ఆత్మగౌరవమనే మాట పలకకుండా చేస్తున్నారు. దానివల్ల వారికి ఒరిగేదేమిటో వారే చెప్పాలి. వారు వలవిసిరి చేపలు పట్టినవారై ఉండరు. వారుకాకుండా కులంలోని మత్స్యకారులు కాని ఇతరులందరూ ఆత్మన్యూనతకు లోనై, దానిని అధిగమించడానికి ఏమిచేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారని ఆలోచించే వారై కూడా ఉండరని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొంతమంది మన కులాన్ని మత్స్యకారకులంగా డిక్లేర్ చేసి, అసలు సిసలైన మత్సకారకులా లతో సమానమని బోధిస్తూ, స్వకులస్తులను అవమానంపాలు చేసి, వారు మాత్రం ఆనందంగా ఉంటూ, ఎవరైనా కులాభివృద్ధి గురించి అడిగితే, 'ఆ! ఎవరూ ఏం చేయలేం!' అని మెట్టవేదాంతం చెబుతు న్నారు. అలాకాకుండా అగ్నికులక్షత్రియుల అభివృద్ధి కోరుకునే వారైతే, అగ్నికులక్షత్రియులు బ్రతుకుతెరువుకోసం ఎంచుకున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకతీతంగా వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి, ఆధునిక సాంకేతికాభివృద్ధిలో భాగస్వాములుగా చేయుటకు కృషి చేస్తే ఎంతో బాగుండేది.
అగ్నికులక్షత్రియులారా! ఇప్పుడుచెప్పండి......
మనముగాని,మన పూర్వీకులుగాని ఏనాడూ మత్స్యకార వృత్తి చేపట్టకపోయినా, మత్స్యకారులుగానే చెప్పుకొని అసలు సిసలైన మత్స్యకారులమని చెప్పుకుంటున్న బెస్త, జాలరి, వాడబలిజ, పల్లి, గంగపుత్ర మొదలగు 14 కులాలతో పోటీపడి ప్రభుత్వము కల్పించు అరకొర రాయితీలకు అర్రులుచాస్తూ ఇప్పటి లాగే ఆత్మన్యూనతలోనే బ్రతకాలా? లేక దానినుండి బయటపడే ప్రయత్నం చేయాలా? ప్రయత్నం ఏ విధంగా ఉండాలి?
ప్రభుత్వము కల్పించు రాయితీలు పొందితేనే అభివృద్ధి చెందగలమా? అవిలేకుండా అభివృద్ధి చెందే తెలివితేటలు, శక్తి యుక్తులు గలవారు మన కులంలో లేరా? ఉంటే వాటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము?
స్వాతంత్ర్యానంతరము స్వయంకృషితో, స్వయంపోషక త్వంతో విద్య, వ్యాపార, సాంస్కృతిక, ఇతర అనేక రంగాలలో అనేక కులాలవారు అభివృద్ధిచెంది సమాజాన్ని శాసించే స్థితిలో ఉన్నట్లు మనంకూడ ఆత్మవిశ్వాసంతో కష్టపడి అభివృద్ధి సాధించలేమా? స్వయంసమృద్ధి పొందలేమా? ఇది అత్యాశ అవుతుందా?
ఆత్మన్యూనతలో కొట్టుకుపోతున్న అగ్నికులక్షత్రియులు ఎవరైనాగాని, అగ్రకులాలవారి చేతనే కాకుండా, సమానస్థాయి, క్రిందిస్థాయిలో ఉన్న అనేక కులాలవారిచేత కూడా అవమానింప బడుతూ, కులదూషణ ఎదుర్కొంటున్నప్పటికి నోరెత్తి మాట్లాడ లేకపోవడానికి కారణము అసమర్థతా? అమాయకత్వమా?
ప్రస్తుత అగ్నికులక్షత్రియల సంఘనాయకులు, రాజకీయ నాయకులు కృషివల్ల అగ్నికులక్షత్రియులలో జరిగిన అభివృద్ధి తృప్తికరంగాఉన్నదా?
దాదాపు 60లక్షల జనాభాగల మత్స్యకారులకు, 20 లక్షల జనాభాగల అగ్నికులక్షత్రియులను కలిపి, మొత్తం 80 లక్షల జనాభాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా మత్స్య కారకోటా క్రింద ఎన్నికైనట్లు అసలు సిసలైన మత్స్యకార కులాల వారు చెప్తున్నారు. ఎన్నికైన ఆ ముగ్గురు ఎమ్మెల్యేల కులవృత్తి మత్స్యకారవృత్తి అని భావించి అగ్నికులక్షత్రియులందరూ మత్స్య కారులుగానే పరిగణింపబడాలని వారి వాదనగా కనబడుతున్నది. అగ్నికులక్షత్రియ కులవృద్ధులు, మేధావులనిపించుకునేవారు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ఒక ప్రక్క నుంచి పల్లీలన్నా, పల్లెకారి అన్నా పల్లవులేనని, అగ్నికులక్షత్రియులేనని చెప్తూ మీరు పల్లి అనిగాని, పల్లెకారి అనిగాని చెప్పుకోవడంలో తప్పులేదని బోధిస్తున్నారు. కాని పల్లవులని చెప్పుకోమనడం లేదు. మరోవైపు నుంచి ప్రభుత్వ ఉత్తర్వులలో బి.సి.-ఎ(1)లో కనిపించు అగ్నికులక్షత్రియులతో కలిపి 15 కులాలవారు అందరూ మత్స్య కారులేనని చెప్తున్నారు. పైగా వారిలో కొన్ని కులాల మధ్య వివాహ బంధాలు కూడ ఏర్పరుచుకొంటున్నారు.
మేమందరం మత్స్యకారులం అని, సమాజంలో ఆ వృత్తికి ఘనమైన గుర్తింపు, గౌరవం ఉన్నట్లు రొమ్మువిరుచుకుని మరీ చెప్పుకునే కొన్ని కులాలవారిని వారి మానాన వారిని బ్రతక నివ్వకుండా కొందరు మత్స్యకారులైన అగ్నికులక్షత్రియులు కౌగిలించుకుని వారితో వివాహబంధాలు కూడా ఏర్పరుచు కుంటున్నారు. అందులో తప్పుపట్టవలసింది ఏమీలేదు. కాని జన్మతః ఏనాడూ మత్స్యకారవృత్తితో సంబంధం లేని వారికి, ఒకవేళ గత్యంతరం లేక ఆ వృత్తిని చేపట్టి, కొంత అభివృద్ధి సాధించి ఆ వృత్తినుండి బయటపడాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమే. వారందరూ కూడ మత్స్యకారులని చెప్పుకోలేకపోతే అన్యమార్గం వెతుక్కోవలసిందే!
మత్స్యకారులమని రొమ్మువిరుచుకొని మరీ చెప్పుకొనే, బి.సి-ఎ(1)లో మత్స్యకారులందరూ అగ్నికులక్షత్రియులుగా పరిగణింపబడడం వల్ల అగ్నికులక్షత్రియులు ఆత్మన్యూనతనుండి బయటపడాలనుకునే వారికి మార్గము దొరుకుతుందా?
కలకత్తా దక్షిణేశ్వరంలో కాళికాలయ నిర్మాత మత్స్యకార కులమైన కైవర్తకులమునకుచెందిన జమిందారిణి రాణి రాస్మణిదేవి అగ్నికులక్షత్రియ కులస్తురాలని ప్రకటిస్తున్నారు. అంటే అగ్నికులక్షత్రియులు మత్స్యకారులని చెప్పకనే చెప్పినట్లవుతుంది.
ప్రస్తుతము సమాజంలో మత్స్యకారవృత్తి వారి కులవృత్తి గా ఘనంగా చెప్పుకున్నా ఎటువంటి ఆత్మన్యూనతకు లోనుకాని వారికి ఏ సమస్యా లేదు. వారిని సమాజంలో ఎలా పిలిచినా, అమవానకరంగా పిలిచినా, 'నా కొ---' అని పిలిచినా దులుపుకు పోయేవారికి ఏ సమస్యా లేదు. కాని మత్స్యకారులని పిలిపించు కోవడం ఇష్టంలేని మత్స్యకారేతరులకు, బ్రతుకుతెరువు కొరకు ఆ వృత్తిని చేపట్టి అది కులవృత్తి కాదని తెలిసిన వారికి మత్స్యకారులని పిలిపించుకోవడం ఇబ్బందే! అటువంటి వారే ఇంటిపేర్లు మార్చి కులంపేరుమార్చి వేరే కులస్తులుగా చలామణి కావాలని కోరుకునే మత్స్యకారులు కాని అగ్నికులక్షత్రియులు తాము అగ్నికులక్షత్రియు లని, పల్లవులమని దైర్యంగా చెప్పుకుని ఆత్మగౌరవంతో బ్రతుకు నట్లు తగిన మార్గం చూపాలి. మార్గదర్శనం కులాన్ని చీలికదిశగా కాకుండా మత్స్యకారేతరులకు ఉపనయనము, సంధ్యావందనం, నిత్యాగ్ని హోత్రం, పురుషులు కూడా నొసటన తిలకధారణ మొ||గు కొన్ని తేలికగా అనుసరించదగ్గ నియమాలు ఏర్పరచవచ్చు.
దీనిపైమీస్పందన తెలియజేయ ప్రార్థన...

సంకల్పం బలంగాఉంటేసాధించలేనిదేదీలేదు.

చుట్టూరాఆవరించుకున్నచీకటిని
తిట్టుకుంటూ కూర్చోకుండా, ప్రయత్నించి
చిన్న దీపాన్నైనా వెలిగిద్దాం!!!