శ్రీ కొపనాతి కృష్ణమ్మ గారు
"అంతర్వేది" శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము నిర్మింపజేసినది, గొప్ప భగవద్భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి "శ్రీ కొపనాతి కృష్ణమ్మ"గారు. కృష్ణమ్మగారి జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం మండలం బెండమూర్లంక శివారు "ఓడలరేవు" గ్రామము. ఇది వైనతేయ గోదావరి సాగరసంగమ పుణ్య స్థలము. వీరు రఘుకులగోత్రజులును, అగ్నికులక్షత్రియులు ను అయి ఉండిరి.
పూర్వీకులు
ఓడల నిర్మాణములో, ఓడల వ్యాపారములో పేరుపొంది సార్థకనామము పొందినది ఓడలరేవు గ్రామము. అగ్నికులక్షత్రియులు సాహసముతో తెరచాప ఓడలను సముద్రములో నడుపుచూ విదేశములతో వ్యాపారము సాగించుచున్న రోజులవి. అట్టి వంశీయులలో అగ్రగణ్యులు కొపనాతివారు. వారియందు సత్యరాజు, మంగమాంబ దంపతులు సత్యవాక్య పరిపాలకులై కీర్తివహించిరి. ఆ పుణ్యదంపతులకు రామనాఖ్యుడు సుపుత్రుడై జన్మించి భక్తవర్యుడని పెంపువహించెను. ఆయనకు అలివేలుమంగమ్మ అర్థాంగియై అమరినది. వీరికి సత్యరాజు, ఆదినారాయణ, శేషయ్య అను పుత్రత్రయము కలిగి పూజ్యులై కీర్తి వహించిరి. ఇందు మధ్యముడైన ఆదినారాయణగారు యుక్తవయస్కులు కాగానే పొన్నమండ నరసింహస్వామి వారి పుత్రికయైన మహాలక్ష్మిని పెండ్లియాడిరి.ఆదినారాయణగారు అనేక ధర్మకార్యములు ఆచరించిన మహామహులు. వీరికి ఏడుగురు కుమారులు కలిగిరి. వారు వరుసగా సుబ్బారాయుడు, చినసుబ్బారాయుడు, రామస్వామి, నారాయణస్వామి, కృష్ణమ్మ, వేంకటరెడ్డి, రంగనాయకులు.

No comments:
Post a Comment